విశ్వసనీయ సమాచారం మేరకు బీర్కూర్ గ్రామంలో జూదం ఆడుతున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించారు. బీర్కూర్ ఎస్సై రాములు సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో జూదం ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నారు. ఈ దాడిలో జూదం కోసం వినియోగిస్తున్న రూ.14,200 నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన ఐదుగురిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నారు. జూదం చట్టరీత్యా నేరమని, దానికి బానిసైతే వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ భవిష్యత్తు కూడా తీవ్రంగా దెబ్బతింటుందని జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర తెలిపారు. జూదంలో డబ్బులు సంపాదించాలనే ఆశతో మొదలుపెట్టి, చివరకు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోయి అప్పుల పాలయ్యే పరిస్థితులు ఏర్పడతాయని ఆయన అన్నారు. జూదం అలవాటుగా మారితే కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో పాటు భార్య, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఎస్పీ పేర్కొన్నారు. అప్పుల భారం పెరిగి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పాటు కొందరు తీవ్ర నిర్ణయాలకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుతో పాటు తమ కుటుంబం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూదానికి పూర్తిగా దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కష్టపడి సంపాదించిన డబ్బును జూదంలో కోల్పోయి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని ఆయన హితవు పలికారు. జిల్లాలో ఎక్కడైనా జూదం నిర్వహిస్తున్నా, జూదం ఆడుతున్నా ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. జూదం నిర్వహించే వారిపై, జూదం ఆడే వారిపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. ప్రజల భవిష్యత్తును, కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో జూదాన్ని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు.






